Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

1000 మందికి పైగా కస్టమర్లపై అమేజాన్ కేసులు!

ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ సేవల సంస్థ అమేజాన్, తమ వెబ్ సైట్లో తప్పుడు రివ్యూలు రాస్తున్నారని 1,114 మంది పై కేసులు పెట్టింది. వీరంతా పలు ప్రొడక్టుల పనితీరు బాగాలేదంటూ, ఓ పథకం ప్రకారం ఇతర కస్టమర్లను పక్కదారి పట్టించేలా సమీక్షలు రాస్తున్నారని ఆరోపించింది. జాన్ డోయిస్ అనే గుర్తు తెలియని అమెరికన్, తాను ఐదు డాలర్లతోనే తప్పుడు రివ్యూలు రాస్తానని 'ఫైవెర్ డాట్ కాం' ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడని, ఇతను ఎవరన్నది తేల్చేందుకు దర్యాఫ్తునకు పోలీసులను అనుమతించాలని కోర్టును కోరింది. ఫేక్ రివ్యూలు రాస్తున్న వారందరి ఐడీలనూ కోర్టుకు అందించింది. కాగా, గతంలోనూ తమ ప్రొడక్టులపై ఫేక్ రివ్యూలను రాస్తున్న వెబ్ సైట్లపై కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తప్పుడు రివ్యూలను రాస్తున్న వారిలో అమేజాన్ నుంచి ప్రొడక్టులను కొనుగోలు చేసిన వారూ ఉన్నారని తెలుస్తోంది. పలు వెబ్ సైట్లు వివిధ రకాల ప్రొడక్టులపై తప్పుడు ప్రచారం సాగించేందుకు సహకరిస్తూ, అవి బాగాలేవని చెప్పే రివ్యూలను విక్రయిస్తుంటాయి. ఈ తరహా ప్రచారం పెరగడం తమ వ్యాపారానికి విఘాతం కలిగిస్తోందని, వీరి సమీక్షలు నమ్మి పలువురు కస్టమర్లు తమకు దూరమవుతున్నారని అమేజాన్ వాపోతోంది.

More Telugu News